Telugu ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ

10th Class Telugu ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers

  1. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

  1. అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
    ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.
    ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి.
    ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
    జనాబులు
    అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
    ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి.
    ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
    ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.
  2. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
    ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
    ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు.
    ఈ) భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
    జవాబులు
    ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
    ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
    ఈ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

 

  1. అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.
    ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
    ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది. ,
    ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
    జవాబులు
    ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
    ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది.
    ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
    అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.
  2. అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
    ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
    ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
    ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
    జవాబులు
    ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
    అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
    ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
    ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
  3. అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
    ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.
    ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
    ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
    జవాబులు
    ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
    అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
    ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
    ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.
  4. అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
    ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.
    ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
    ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
    జవాబులు
    ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
    ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
    అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
    ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.

 

  1. అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
    ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
    ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.
    ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్ధిస్తూ హర్షధ్వానాలు చేశారు.
    జవాబులు
    ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు.
    ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
    అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
    ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.
  2. అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
    ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
    ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.
    ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
    జవాబులు
    ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
    ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
    అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
    ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.

 

  1. అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.
    ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
    ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
    ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
    జవాబులు
    ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
    ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
    ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
    అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.
  2. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
    ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
    ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
    ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు.
    జవాబులు
    ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
    ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
    ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

పాత్ర స్వభావాలు

  1. శ్రీరాముడు :
    రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. శరణన్నవారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్లా, గురువుల పట్లా నిశ్చలభక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.
  2. మంథర :
    కైకేయి అత్తవారింటికి వచ్చినపుడు వెంట వచ్చిన అరణపు దాసి మంథర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మంథర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనస్సును మార్చింది.

రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని చూచించింది.

  1. గుహుడు :
    శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి వెడుతున్న సీతారామలక్ష్మణులను గంగా నదిని దాటించాడు. ధర్మాత్ముడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘పతిని అనుసరించుటయే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం’. అన్న సీత మాటల ద్వారా మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
సీతాదేవి పతివ్రత. పతిని సేవించనిదే జీవించలేదు. తన భర్తను మించిన లోకం లేదు. తన భర్తతోటే సకల సౌఖ్యాలు అనుకొనే ఉత్తమ ఇల్లాలు సీత అని గ్రహించాను.

ప్రశ్న 2.
“అమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తా” అని కైకేయితో రాముడు పలికిన సన్నివేశాన్ని బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
రామునికి రాజ్యకాంక్ష లేదని, తండ్రి ఆజ్ఞను పాటించడం కన్న గొప్ప ధర్మం మరొకటి లేదని, రాముడు భావించేవాడనీ నేను గ్రహించాను.

రామునకు తల్లుల మాటపై పెద్ద గౌరవం అనీ, రామునికి తల్లులందరూ సమానమేననీ, వారి మాటను రాముడు బాగా గౌరవించేవాడని గ్రహించాను. అందుకే తనకు సవతి తల్లియైన కైక చెప్పగానే, తండ్రి స్వయంగా చెప్పకపోయినా, పినతల్లి కైక మాటను తండ్రి మాటగానే గౌరవించి రాముడు అడవికి ప్రయాణమాయ్యడు.

రాముడు మాతా పితృభక్తుడనీ, వారి మాటలకు జవదాటడనీ, రాజ్యకాంక్ష లేనివాడనీ పై మాటను బట్టి గ్రహించాను.

 

ప్రశ్న 3.
“కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు”. కవి చెప్పిన ఈ మాటలను బట్టి, కైక మనః ప్రవృత్తిని నీవు ఏమి గ్రహించావో వివరించుము.
జవాబు:
కైక మంథర దుష్టబోధలను విని, రాముని 14 ఏండ్లు వనవాసానికి పంపమనీ, తన కుమారుడు భరతునికి రాజ్యపట్టాభిషేకం చేయమనీ దశరథుని కోరింది.

కైక మాటలు విని, దశరథుడు స్పృహ కోల్పోయాడు. కొంత సేపటికి తేరుకొని, దశరథుడు రాముని అడవులకు పంపవద్దని, కైకను బ్రతిమాలాడు. రాముణ్ణి విడిచి తాను ఒక్కక్షణమైనా బతకలేనని, చేతులు జోడించి కైకను ప్రార్థించాడు. కైక పాదాలను పట్టుకుంటానన్నాడు. రాముణ్ణి తనకు దూరం చేయవద్దని కైకను దశరథుడు బ్రతిమాలాడు.

కాని కైక మనస్సు కఠినమైన రాయి వంటిది. అందుకే భర్త బ్రతిమాలినా, ఆమె మనస్సు మార్చుకోలేదు. తన పట్టుదలను విడవలేదు. కైక మొండిదని, అందుకే భర్త తన కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా, తన మొండి పట్టు ఆమె విడిచి పెట్టలేదనీ గ్రహించాను.

ప్రశ్న 4.
“మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా, ఇష్టపడను” అని సీత రామునితో చెప్పిన మాటలను బట్టి, సీత స్వభావాన్ని గూర్చి నీవేమి గ్రహించావు?
జవాబు:
శ్రీరాముడు పితృవాక్య పాలనకై అడవికి వెడుతున్నాడు. రాముడు సీతకు ఆ విషయం చెప్పి, అయోధ్యలో సీత ఎలా మసలుకోవాలో ఆమెకు తెలిపాడు. సీత రాముని మాటలను కాదని, తాను రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికే ఇష్టపడింది. అయోధ్యలో ఉంటే సుఖంగా ఉండవచ్చు. రాముని వెంట వెడితే అరణ్యాలలో బాధలు పడాలి.

సీత మహా పతివ్రత కాబట్టి, అయోధ్యలో రాముడు లేకుండా స్వర్గసుఖాలు తనకు లభించినా తనకు అవి అక్కరలేదనీ, భర్తను అనుసరించడమే భార్యకు ధర్మం అనీ, శుభప్రదం అనీ చెప్పింది.

దీనిని బట్టి సీత మహా పతివ్రత అని, ధర్మజ్ఞురాలని, ఉత్తమ స్త్రీయని, నేను గ్రహించాను.

 

ప్రశ్న 5.
“రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే, అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది? అని కైక, మంథరతో అన్న మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక మొదటిలో రాముడిని ఎంతో ప్రేమతో చూసేదనీ, తన పుత్రుడైన భరతునితో సమంగా ఆమె రాముని ప్రేమించేదనీ గ్రహించాను. అలాగే రాముడు కూడా తల్లులందరి దగ్గరా సమానమైన ఆదరాన్ని పొందేవాడనీ తెలుసుకున్నాను.

తన దాసి మంథర చేసిన దుష్టమైన ఉపదేశం వల్లనే కైక బుద్ధి మారిపోయిందనీ, రాముడిని ఆమె పట్టుపట్టి అడవులకు పంపిందనీ, నేను గ్రహించాను. చెడు మాటలు వింటే, మంచివారు సైతం పాడయిపోతారని గ్రహించాను.

ప్రశ్న 6.
“నా తండ్రే, నాకు పాలకుడు. గురువు. హితుడు. ఆయన ఆదేశించాలే కాని, విషాన్ని తాగడానికైనా, సముద్రంలో దూకడానికైనా నేను సిద్ధమే” అని రాముడు కైకతో పలికిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రాముడు గొప్ప పితృభక్తి కలవాడని గ్రహించాను. తండ్రియే తనకు గురువనీ, పరిపాలకుడనీ రాముడు భావించేవాడని గ్రహించాను. అంతేకాదు. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు, విషమును సైతం శంకలేకుండా త్రాగుతాడని గ్రహించాను. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు సముద్రంలోనైనా దూకుతాడని గ్రహించాను.

రాముడు, పితృవాక్యపరిపాలకుడనీ, తండ్రి యంటే ఆయనకు గొప్ప భక్తి గౌరవములు ఉన్నాయని గ్రహించాను. రాముని వంటి పితృవాక్య పరిపాలకుడు చరిత్రలో మరొకడు ఉండడని తెలుసుకున్నాను.

ప్రశ్న 7.
“అన్నా ఈ పాదుకల మీదనే రాజ్యపాలనాభారాన్ని ఉంచుతాను. పదునాల్గవ సంవత్సరం కాగానే, నీ దర్శనం కాకుంటే, అగ్ని ప్రవేశం చేస్తాను” అని భరతుడు రామునితో చెప్పిన మాటలను బట్టి, నీవేమి తెలుసుకున్నావు?
జవాబు:
భరతుడు గొప్ప సోదర భక్తుడు. అతడు తనకు రాజ్యం లభించినా కాదని, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి, అన్నకు సేవకునిగా తాను రాజ్యం పాలించాడు. అన్నగారు 14 సంవత్సరాల తర్వాత తనకు మాట ఇచ్చిన ప్రకారము అయోధ్యకు తిరిగి రాకపోతే, అగ్నిలో దూకి ప్రాణాలు వదలడానికి భరతుడు సిద్ధమైనాడని గ్రహించాను.

తల్లి తనకు రాజ్యం ఇప్పించినా కాదని, అన్న రామునిపై భక్తి గౌరవములు చూపించిన గొప్ప సోదర భక్తుడు, సోదర వాత్సల్యం కలవాడు, భరతుడని నేను గ్రహించాను.

ప్రశ్న 8.
శ్రీరాముని పాదుకలను తీసుకుని, నందిగ్రామం వెళ్ళి వాటికి పట్టాభిషేకం చేసిన భరతుని చర్యను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక కోరిన రెండు వరాల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. పుత్రశోకంతో దశరథుడు మరణించాడు. భరతుడు తన తల్లిని దూషించాడు. అరణ్యంలోకి వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవాలని గ్రహించాడు. చివరకు భరతుడు రాముడు ఇచ్చిన పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామం వెళ్ళి శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

దీనివల్ల భరతునికి శ్రీరాముని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని గ్రహించాడు. అన్నలేని అయోధ్యకు వెళ్ళకూడదని, నిశ్చయించుకున్నాడని గ్రహించాను. భరతునికి రాజ్యాధికారం పట్ల వ్యామోహం లేదని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

ప్రశ్న 2.
కైకేయికి దశరథుడిచ్చిన వరాల వలన ఏమయింది?
జవాబు:
దేవాసుర సంగ్రామంలో కైకకు దశరథుడు వరాలిస్తానన్నాడు. సమయం వచ్చినపుడు అడుగుతానంది. శ్రీరామ పట్టాభిషేకం ఏర్పాట్లలో ఉన్నపుడు ఆ వరాలను అడిగింది. ఒకటి శ్రీరామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముని వనవాసానికి పంపాలనేది రెండవ వరం. ఈ వరాలు ఇవ్వడం వలన దశరథుడు మరణించాడు. సీతారాములు అడవుల పాలయ్యారు.

 

ప్రశ్న 3.
పాదుకా పట్టాభిషేకం గురించి వ్రాయండి.
జవాబు:
తండ్రికి అంత్యక్రియలు జరిపాడు భరతుడు. తర్వాత చిత్రకూటం వైపు వెళ్లి శ్రీరాముని దర్శించాడు. అయోధ్యకు రమ్మన్నాడు. రాజువు కమ్మని వినయంగా ప్రార్ధించాడు. శ్రీరాముడు ఒప్పుకోలేదు. కనీసం పాదుకలనైనా ఇమ్మన్నాడు. రాముడు అనుగ్రహించాడు. పాదుకలతో నందిగ్రామం చేరాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేశాడు. ఆ పాదుకలకు ప్రతినిధి తాను సేవకుడిగా రాజ్య వ్యవహారాలు చూశాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చెప్పుడు మాటలు చేటుకు కారణమని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు?
జవాబు:
రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాల ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.

అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది. రాముడిని అడవులకు పంపింది. అందుకే చెప్పుడు మాటలు, చేటుకు కారణం అని చెప్పాలి.

ప్రశ్న 2.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రాజాజ్ఞతో మంత్రులు, అధికారులూ రాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి, ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రాముని పిలిచి, పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాస దీక్ష చేపట్టారు.

రాముడి పట్టాభిషేకం వార్త కైక దాసి మంథరకు తెలిసింది. ఆ వార్తను మంథర కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్బోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకోమని మంథర సలహా చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం 2) రాముడి వనవాసం. దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.

కైక రామునికి కబురంపింది. తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని రాముడు అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలు గురించి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. రాముడు తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గూర్చి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి చెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లక్ష్మణుడితో సీతారాములను తల్లిదండ్రులవలె సేవింపుమని చెప్పింది.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.

 

ప్రశ్న 3.
శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణమేమి?
(లేదా)
సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. (వనవాసానికి వెళ్ళిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది.

రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే ప్రజలు నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.

రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు.

గుహుడు గంగను దాటడానికి నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. ముని, సీతారామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.

జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమ వాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలోని ‘చిత్రకూటం’ పవిత్రమైనదనీ, అది మహర్షుల నివాస స్థానం అనీ, భరద్వాజుడు చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.

ప్రశ్న 4.
“భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.

భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు.

భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.

భరత శత్రుఘ్నులు రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం కాగానే, రామదర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు.

భరతుడు నందిగ్రామం చేరి రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

 

ప్రశ్న 5.
శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రజలు ఎందుకు సమర్థించారు? విశ్లేషించండి.
జవాబు:
శ్రీరాముడు సకల గుణాభిరాముడు. శ్రీరాముడు సద్గుణాల రాశి. రాముడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడు. : . , రాముడు మహావీరుడు. రాముడు మృదువుగా మాట్లాడతాడు. శరణు అన్నవారిని రాముడు కాపాడతాడు.

శ్రీరాముడు కోపమూ, గర్వమూ లేనివాడు. సత్యమును పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. శ్రీరాముడు వినయము కలవాడు.

శ్రీరాముడు తల్లిదండ్రులపట్ల, గురువులపట్ల నిశ్చలభక్తి కలవాడు. రాముడు సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. అన్ని కళలలోనూ ఆరితేరినవాడు. అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

శ్రీరాముడు ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టి తల్లిదండ్రులతోపాటు, ప్రజలు కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థించారు.

ప్రశ్న 6.
శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు?
జవాబు:
ప్రజల కోరిక మేరకు దశరథుడు, శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు ఉపవాసదీక్ష చేపట్టారు.

రాముని పట్టాభిషేకం వార్త మంథరకు తెలిసింది. మంథర కైకకు చెప్పి, ఆమె మనస్సును మార్చింది. దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరాలను ఉపయోగించుకోమని మంథర కైకకు దుర్బోద చేసింది. కైక కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం, 2) రాముడి వనవాసం.

దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కైక మనస్సు మారలేదు. కైక భర్త అనుమతితో రామునికి కబురు చేసింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక, తాను కోరిన వరాలను గూర్చి రాముడికి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానన్నాడు రాముడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.

రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

రాముని వెంట సీతాలక్ష్మణులు వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు తండ్రి వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు.

సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతరామలక్ష్మణులు రథం ఎక్కారు. ఈ విధంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు.

 

ప్రశ్న 7.
దశరథుని మరణవార్త విని, భరతుడెలా స్పందించాడు?
జవాబు:
రాముడు అడవికి వెళ్ళాడని దశరథుడు దుఃఖంతో మరణించాడు. దూతలు వెళ్ళి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు, తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలనీ, తాను రాముణ్ణి తీసుకు వస్తాననీ, భరతుడు అడవికి బయలుదేరాడు.

భరత శత్రుఘ్నులు అడవిలో రాముడిని కలిసి, ఆయన పాదాలపై పడ్డారు. రాముడు కన్నీరు పెట్టాడు. రాముడిని అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటయే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుడు కోరగా, రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. రాముని పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, భరతుడు నారచీరలు ధరించి, తాను అయోధ్యా నగరం బయట ఉంటానన్నాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*