Telugu ఉపవాచకం 1st Lesson బాలకాండ

10th Class Telugu ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers

  1. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం
1. అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
జవాబులు
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.

  1. అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
    ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
    ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.
    ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
    జవాబులు
    ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
    అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
    ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
    ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.

 

  1. అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
    ఆ) ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు.
    ఇ) హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.
    ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
    జవాబులు
    ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
    అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
    ఆ) ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంటను చూశాడు.
    ఇ) హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.
  2. అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
    ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు.
    ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
    ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
    జవాబులు
    అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
    ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తునాడు.
    ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
    ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
  3. అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
    ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
    ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
    ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
    జవాబులు
    ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
    ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
    అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
    ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
  4. అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.
    ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
    ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.
    ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
    జవాబులు
    ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
    ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
    అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావంచేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.
    ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి, అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.
  5. అ) దేవతలు వరగర్వముచేత కన్నూమిన్నూగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.
    ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
    ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
    ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాధారియై వచ్చాడు.
    జవాబులు
    ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
    ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
    ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాథారియై వచ్చాడు.
    అ) దేవతలు వరగర్వము చేత కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.

 

  1. అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.
    ఆ) ‘ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
    ఇ) దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
    ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది.
    జవాబులు
    ఇ) దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
    ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో, దివ్యపాయసముంది.
    ఆ) ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
    అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.
  2. అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
    ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
    ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.
    ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే.
    జవాబులు
    ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
    అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
    ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే..
    ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.
  3. అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
    ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
    ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
    ఈ) తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.
    జవాబులు
    అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
    ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
    ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
    ఈ) తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.
  4. అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్ర మహర్షి.
    ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు.
    ఇ) వీటి ప్రభావం వల్ల, అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
    ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.
    జవాబులు
    ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు.
    అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్రుడు.
    ఇ) వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
    ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.
  5. అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
    ఆ) శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
    ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
    ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.
    జవాబులు
    ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
    అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
    ఆ) శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
    ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.

పాత్ర స్వభావాలు

  1. నారద మహర్షి :
    దేవఋషి. రామాయణగాథను వాల్మీకికి ఉపదేశించినవాడు. బ్రహ్మయొక్క మానసపుత్రుడు. త్రిలోక సంచారి. నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు. లోకకల్యాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. ఋషులకు మార్గదర్శకుడు. రామాయణ కథారచనకు మూలపురుషుడు.
  2. వాల్మీకి :
    మునిశ్రేష్టుడు. జిజ్ఞాసకలవాడు. ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి, అప్రయత్నంగా కవిత్వాన్ని వ్రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్టుడు.
  3. దశరథ మహారాజు :
    కోసల దేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్ఠిని చేసి నలుగురు పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు. ధర్మాత్ముడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పుత్రవ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు.
  4. వశిష్ఠుడు :
    దశరథుని ఇంటి పురోహితుడు. బ్రహ్మర్షి. దశరథునికి అనేక ధర్మసందేహాలను తీర్చేవాడు. శ్రీరామునకు కర్తవ్యబోధ చేసినవాడు.
  5. కౌసల్య :
    దశరథ మహారాజు భార్య. శ్రీరాముని తల్లి. ఏనాడూ భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరాముడు అరణ్యవాసానికి బయల్దేరేటప్పుడు శ్రీరాముని వనవాస ప్రయత్నం విరమింపజేయాలనుకుంది. ఫలించలేదు. పుత్రవ్యామోహంతో వనవాసానికి తానూ వస్తానంది. రాముడు ఒప్పుకోలేదు. శ్రీరాముడికి ధర్మబోధ చేసింది. ధైర్యం చెప్పిన వీరనారి. ధర్మాన్ని విడిచి పెట్టవద్దని చెప్పిన మహారాణి కౌసల్య.
  6. సుమిత్ర :
    దశరథ మహారాజుకు రెండవ భార్య. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈమె సంతానం. కౌసల్యాదేవి అడుగుజాడలలో నడిచింది. భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందర్నీ సమానంగా చూసిన మాతృమూర్తి.
  7. కైక :
    కేకయరాజు కూతురు. పరాక్రమవంతురాలు. యుద్ధవిద్యలు కూడా తెలుసు. చెప్పుడు మాటలకు లొంగిపోయే స్వభావం కలది. మంథర చెప్పిన చెప్పుడు మాటలతో శ్రీరామ వనవాసానికి కారకురాలైంది. అందరి నిందలను పడింది. దశరథుని మరణానికి కూడా కారకురాలైంది. ఒక దుష్ట స్త్రీ పాత్రగా మిగిలిపోయింది.
  8. ఋష్యశృంగుడు :
    విభాండక మహర్షి కొడుకు. దశరథుని కుమార్తె శాంతను వివాహం చేసుకున్నాడు. పుత్రకామేష్ఠి యాగం దశరథుని చేత చేయించాడు. ఋష్యశృంగుడు సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. భూమి సస్యశ్యామలంగా ఉంటుంది.
  9. శ్రీరాముడు :
    ఎవరికీ లేనన్ని మంచి గుణాలు కలవాడు. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. సీతాపతి. ధర్మమూర్తి. ఆదర్శవంతమైన కొడుకు. ఆదర్శమూర్తియైన, మర్యాద పురుషుడైన భర్త. శత్రువైన మారీచుని చేత కూడా పొగడబడినవాడు.
  10. లక్ష్మణుడు :
    దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు. అన్నావదినల సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నావదినలకు నీడలా ఉన్నాడు. సీతారాములలోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి. రామరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధానకారకుడు. ధర్మస్వరూపుడు.
  11. భరతుడు :
    కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు. కైక రాజ్యా ధికారం చేపట్టమని కోరినా శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. తల్లిని కూడా దూషించాడు. రాజ్యంపై కోరిక లేనివాడు. కేవలం శ్రీరాముని సేవించడానికే జన్మించాననుకొనే పుణ్యపురుషుడు.
  12. శత్రుఘ్నుడు :
    సుమిత్రయందు దశరథునకు జన్మించాడు. లక్ష్మణుని స్వభావం శత్రుఘ్నుని స్వభావం ఒక్కటే. అన్నగార్లపై అమితమైన గౌరవం కలవాడు.
  13. విశ్వామిత్రుడు :
    గాధి యొక్క కుమారుడు. శ్రీరామలక్ష్మణుల యాగ సంరక్షణార్థం తీసుకొని వెళ్ళాడు. వారికి బల, అతిబల, విద్యలను ఉపదేశించాడు. వాటి వలన రామలక్ష్మణులకు అలసట, ఆకలిదప్పులు ఉండవు. ధనుర్విద్యలో రామలక్ష్మణులను తీర్చిదిద్దాడు. అనేక అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్పాడు. రామలక్ష్మణుల ధనుర్విద్యా గురువు.
  14. భగీరథుడు :
    దృఢ సంకల్పం కలిగినవాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి ప్రక్కకు తప్పుకోకుండా, సంకల్పాన్ని నెరవేర్చుకోగల ధీశాలి. పట్టుదల కలవాడు. పట్టుదల విషయంలో ‘భగీరథ ప్రయత్నం’ అన్న జాతీయం ఏర్పడటానికి నెరవేర్చుకోగల ధీశా కలిగినవాడు.
  15. జనక మహారాజు :
    మిథిలానగరపు రాజు. సీతాదేవికి తండ్రి. రాజర్షి. ధర్మశాస్త్రాలు తెలిసినవాడు. ఋషులకు కూడా సందేహాలు తీర్చగలవాడు. మహాజ్ఞాని.
  16. పరశురాముడు :
    రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షణం చేసి, క్షత్రియులను సంహరించాడు. చాలా కోపం ఎక్కువ. అధర్మాన్ని సహించడు. అధికార గర్వాన్ని అంతం చేస్తాడు. వేదాధ్యయనం చేసినవాడు. తన శక్తిని కూడా శ్రీరామునకు ఇచ్చినవాడు. పరశురాముడంటే రాజులకు సింహస్వప్నం.

సంఘటన ద్వారా గ్రహించుట )

ప్రశ్న 1.
“మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యము” అని – శ్రీరాముడు తాటకను చంపడం విషయంలో విశ్వామిత్ర మహర్షితో చెప్పిన మాటలను బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
పై మాటలను బట్టి శ్రీరాముడు గొప్ప పితృవాక్య పరిపాలకుడని, గ్రహించాను. గురువైన విశ్వామిత్రుడు చెప్పినట్లు నడుచుకోవడం, ఆయన ఆజ్ఞను పాలించడం, శిష్యుని ధర్మమని రాముడు భావించాడనీ, అతడు గురువు చెప్పినట్లే తాటకను వధించాడనీ గ్రహించాను.

తాటక స్త్రీ అయినా, ఆమె దుష్టురాలు కాబట్టి ఆమెను చంపడం తన కర్తవ్యమని రాముడు భావించాడని నేను – గ్రహించాను. అదీగాక విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని, తన తండ్రి దశరథుడు చెప్పిన మాటను, రాముడు వేదవాక్యంగా భావించి, స్త్రీవధ అని శంకించకుండా గురువు చెప్పినట్లు తాటకను సంహరించాడని గుర్తించాను.

 

ప్రశ్న 2.
‘రాముణ్ణి వదలి నేను ఒక క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు’ అని దశరథుడు విశ్వామిత్రునితో చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు తాను చేయబోయే యజ్ఞరక్షణకై శ్రీరాముడిని తనతో పంపమని, దశరథుడిని అడిగాడు. అప్పుడు దశరథుడు పై మాటలను విశ్వామిత్రుడితో అన్నాడు.

దశరథమహారాజుకు, రాముడు అంటే ప్రాణమనీ, రాముడు ఆయనకు లేక లేక పుట్టిన సంతానమనీ నేను గ్రహించాను. దశరథుడు పుత్రకామేష్టి చేయగా ఆయన నోములు పండి, రాముడు జన్మించాడనీ, రాముడిని వదలి దశరథుడు ఉండలేడనీ, రాముడు అంటే దశరథునకు బాగా ప్రేమ అనీ, పై దశరథుని మాటల వల్ల నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 3.
రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అని పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మమార్గంలో ఉంటారని, సత్యం, నీతి, భక్తి, గౌరవం మొదలైన భావాలను కల్గి ఉంటారని గ్రహించాను. దశరథుడు, శ్రీరాముడు వంటి రాజులు ధర్మాత్ములు, సత్యకంధులు. ఆడినమాట తప్పనివారు. అట్టివారు రాజులుగా ఉన్నారు కాబట్టే ప్రజలు కూడా వారి మార్గంలోనే నడిచారని గ్రహించాను.

రాజులు ఎల్లప్పుడు ధర్మమార్గంలో ఉండాలని, ప్రజలను రక్షించాలని, వారి యోగక్షేమాలను చూడాలని, ఆ విధంగా చేస్తే ప్రజలు కూడా నీతిమార్గంలో నడిచే అవకాశం ఉంటుందని గ్రహించాను.

ప్రశ్న 4.
ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూలకారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలను గ్రహించాను.

  1. దృఢసంకల్పానికి అసాధ్యమైనది ఏదీలేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే, జయం వస్తుందని తెలిసింది.
  2. భగీరథుడు రాముని వంశంవాడే. భగీరథుని గురించి చెప్పడం వల్ల రామునికి తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియచేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం ఆంతర్యం.
  3. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే.

ప్రశ్న 5.
గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి? శిష్యుడు పొందలేనిదేమిటి? అని కవి చెప్పడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణ కోసం తన వెంట తీసుకొని వెళ్ళాడు. రామలక్ష్మణులకు ఆకలి దప్పికలు కలుగకుండా ఉండటానికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశించాడు. శ్రీరామునికి విద్యాస్త్రాలను అనుగ్రహించాడు.

ఆ శక్తితో రాముడు తాటకి వంటి రాక్షసులను సంహరించాడు. యాగాన్ని రక్షించాడు. రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాడు. అందువల్ల గురువు ప్రేమతో శిష్యునికి అనుగ్రహిస్తే అతడు పొందలేనిది ఏమీ లేదని గ్రహించాను.

ప్రశ్న 6.
” జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం” అని చెప్పిన కవి మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
గురువుల నుండి విద్యను అర్థించువారు విద్యార్థులు. విద్యార్థులు చక్కని విద్యను పొందడానికి గురువులను భక్తి, శ్రద్ధలతో సేవించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రహించాను. రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని సేవించారు. అతని మాటలను వేదవాక్కుగా భావించారు. అప్రమత్తులై సేవించారు. అందువల్లనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.

విద్యార్థులు విద్యార్జనలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సోమరితనం, గర్వం మొదలైన దుర్గుణాలను విడిచి పెట్టాలని, అదే ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణమని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వాల్మీకి చెప్పిన మొదటి శ్లోకానికి కారణాలేమిటి?
జవాబు:
ఒకసారి వాల్మీకి తన శిష్యులతో తమసా నదిలోకి స్నానానికి దిగాడు. అక్కడ ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు. ఆనందించాడు. ఇంతలో ఒక వేటగాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు. అది నెత్తురోడుతూ, విలవిలలాడుతూ మరణించింది. అది తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది.

హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని వాల్మీకి చూశాడు. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ఆయన నోటి వెంట అప్రయత్నంగా ‘మానిషాదప్రతిష్టాంత్వ..’ అనే శ్లోకం వచ్చింది.

ప్రశ్న 2.
అయోధ్యను వివరించండి.
జవాబు:
సరయూ నదీతీరంలో ‘కోసల’ దేశం ఉంది. దానిలోనిది అయోధ్యా నగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. దీనిని మనువు నిర్మించాడు.

 

ప్రశ్న 3.
దశరథునికి ఎన్ని ఉన్నా ఒక చింత కుంగదీసింది కదా ! ఆ చింతను ఎలా అధిగమించాడు?
జవాబు:
దశరథునికి ఎన్ని ఉన్నా సంతానం లేదనే చింత కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం ఋషీశ్వరుల అనుజ్ఞతో అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత ‘పుత్రకామేష్ఠి’ చేశాడు. సంతానం కలిగింది. శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు.

ప్రశ్న 4.
దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. ఎందుకు?
జవాబు:
తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానని విశ్వామిత్రుడికి దశరథుడు చెప్పాడు. విశ్వామిత్రుడు తన యాగానికి మారీ సుబాహులనే రాక్షసుల వలన కలుగుతున్న బాధను చెప్పాడు. యాగ సంరక్షణకు శ్రీరాముని తనతో పది రోజులు పంపమన్నాడు. రావణుడు ఈ రాక్షసుల వెనుక ఉన్నాడు కనుక పంపలేనన్నాడు. కావాలంటే తాను వస్తానన్నాడు దశరథుడు. దానితో విశ్వా మిత్రుడికి కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

ప్రశ్న 5.
బల, అతిబల విద్యల గురించి వ్రాయండి.
జవాబు:
ఈ విద్యలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఉపదేశించాడు. వీటి ప్రభావం వలన అలసట ఉండదు. ఆకలి ఉండదు. దాహం ఉండదు. శరీరం కాంతి తగ్గదు. నిద్రలో ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాలలో ఎవ్వరూ ఎదురొడ్డి నిలబడలేరు.

ప్రశ్న 6.
తాటక వధ న్యా యమా?
జవాబు:
తాటక యక్షిణి. వేయి ఏనుగుల బలం కలది. విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడుచేస్తోంది. ఒక స్త్రీని వధించడం మహా పాతకమని రాముడు అనుకొన్నాడు. మౌనంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు తాటకను చంపమన్నాడు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదన్నాడు. తన తండ్రి తనను విశ్వామిత్ర మహర్షి చెప్పినట్లు నడుచుకోమన్న విషయం శ్రీరాముడు గుర్తుచేసుకొన్నాడు. పితృవాక్య పరిపాలకుడు కనుక విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను శిరసావహించాడు. తాటకను చంపాడు. ఇది న్యాయమే.

ప్రశ్న 7.
‘భగీరథ ప్రయత్నం’ అనే జాతీయం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
పాతాళంలో కపిల మహర్షి కోపాగ్నికి సగరపుత్రులు బూడిద కుప్పలయ్యారు. గంగా ప్రవాహంతో వారికి ఉత్తమగతులు కల్పించాలని సంకల్పించారు. భగీరథుడు తపస్సు చేసి, బ్రహ్మను, విష్ణువును, శివుని మెప్పించి గంగను భూమికి దింపాడు. జహ్ను మహర్షిని ప్రార్థించి ఆటంకం తొలగించాడు. అనేక కష్టాలను ఓర్పుతో అధిగమించాడు. గంగను ప్రవహింపజేశాడు. అందుకే భగీరథ ప్రయత్నం జాతీయం ఏర్పడింది. చాలా కష్టపడి సాధించిన వాటి విషయంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
శివధనుర్భంగాన్ని వివరించండి.
జవాబు:
మహాబలవంతులు ఐదువేల మంది శి వధనుస్సుతో ఉన్న పేటికను తెచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ధనుస్సు మధ్య భాగాన్ని శ్రీరాముడు అవలీలగా పట్టుకొన్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన శ్రీరాముని చేయి సోకగానే ధనువు వంగింది. వింటి నారిని సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాంతం లాగాడు. భయంకరమైన శబ్దం చేస్తూ విల్లు ఫెళ్లున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప సభలోని వారంతా ఆ ధ్వనికి మూర్ఛపోయారు. సీతారాముల కల్యాణానికి అంకురార్పణ జరిగింది.

ప్రశ్న 9.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

 

ప్రశ్న 10.
‘అతిథిదేవోభవ’ అతిథి మనకు దేవునితో సమానం – వివరించండి.
జవాబు:
తిథి నియమములు లేకుండా వచ్చేవాడు అతిథి. తల్లి, తండ్రి తర్వాత స్థానం అతిథిదే. మనవల్ల ఇతరులకు సంతోషం కలుగుతున్నప్పుడు మన జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది. ఆ సార్థకత మనం అతిథులను ఆదరించినపుడే కలుగుతుంది. అందుకే పెద్దలు ‘అతిథి దేవోభవ’ అన్నారు. భగవత్స్వరూపంగా అతిథిని భావించాలి. సాయం కోరి మన వద్దకు వచ్చిన వ్యక్తిని నిరుత్సాహపరచకుండా కోరిన సాయం చేయటం ఉత్తమ లక్షణంగా పెద్దలు పేర్కొన్నారు. రామాయణంలోను విశ్వామిత్రుడు వచ్చినపుడు దశరథుడు అతిథి మర్యాదలు చేశాడు. విశ్వామిత్రుని ద్వారా రామలక్ష్మణులు ఎన్నో విద్యలను కూడా పొందారు. కనుక అతిథి మనకు దేవునితో సమానం.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సీతారామ కళ్యాణమును రాయండి.
(లేదా)
సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
(లేదా)
సీతారామ కళ్యాణమును మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.

మిథిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.

మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. చాలామంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని చెప్పాడు.

విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది.

జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

దశరథుడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి, మహేంద్రపర్వతానికి వెళ్ళాడు.

 

ప్రశ్న 2.
వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
(లేదా)
వాల్మీకి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి.
జవాబు:
నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “అన్ని మంచిగుణాలు కలవాడూ, మాట తప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలయిన శుభలక్షణాలు గలవాడు” ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడు ఒక్కడు అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం చెప్పాడు. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

ప్రశ్న 3.
భగీరథుడు గంగను భూమికి తీసుకురావడంలో ఎలా సఫలమయ్యాడోమీసొంతమాటల్లో వివరించండి.
జవాబు:

  1. పాతాళంలో బూడిద కుప్పలుగా పడివున్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సురగంగను అక్కడ ప్రవహింపజేయాలని సంకల్పించాడు భగీరథుడు.
  2. బ్రహ్మను గూర్చి, శివుణ్ణి గూర్చి ఘోర తపమాచరించి గంగను భూమి పైకి వదలడానికి బ్రహ్మను, గంగను భరించడానికి శివుణ్ణి ఒప్పించాడు.
  3. గంగ యొక్క అహంకారానికి కోపించి శివుడు గంగను బంధించగా మరల శివుణ్ణి ప్రార్థించి గంగను విడిపించాడు.
  4. గంగా ప్రవాహ వేగానికి కోపించిన జహ్ను మహర్షిని శాంతింపజేసి గంగను మరల ప్రవహించేలా చేశాడు.
  5. ఈ విధంగా గంగను తీసుకురావడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భగీరథుడు వాటిని ఎదుర్కొని గంగను భూమి పైకి తీసుకురావడంలో కృతకృత్యుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో “భగీరథ ప్రయత్నం” అన్న జాతీయం వాడుకలోకి వచ్చింది.

ప్రశ్న 4.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి.
(లేదా)
రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం.
జవాబు:
సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం ‘అయోధ్య’. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడు రోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు, ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని, దేవతలు బ్రహ్మను కోరారు.

బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొని వచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

 

ప్రశ్న 5.
రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 6.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన విధం రాయండి.
జవాబు:
అయోధ్యను రాజధానిగా చేసుకొని, కోసల దేశాన్ని దశరథుడు పాలించేవాడు. దశరథునికి సంతానం లేదు. సంతానం కోసం దశరథుడు అశ్వమేధయాగాన్ని చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు యాగాన్ని చేయించడానికి ఋష్యశృంగ మహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు అశమేధయాగం చేయించా. పుత్రుల కోసం యజ్ఞం చేయించండని దశరథుడు ఋష్యశృంగుడిని కోరాడు. ఇంతలో దేవతలు విష్ణుమూర్తిని మానవుడిగా పుట్టి రావణాసురుడిని సంహరింపమని కోరారు. దశరథుని ముగ్గురు భార్యలకూ నాలుగు రూపాలలో పుత్రుడిగా పుట్టమని, దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు సరే అని వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించిన ఒక దివ్యపురుషుడు, బంగారుపాత్రతో దివ్యపాయసం తెచ్చి దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

 

ప్రశ్న 7.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేమిటి? రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు?
జవాబు:
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం. గురువుగారికి సేవ చేయడం, కూడా ఉత్తమ విద్యార్థి లక్షణం.

రామలక్షణులు ఉత్తమ విద్యార్థులు : వారు తమ గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తారు. వారు గురువు వెంట వెళ్ళి, సకాలంలో లేచి, నిత్యకర్మలు చేసేవారు. గంగాసరయూ నదుల సంగమం వంటి వాటి గురించి గురువుగారిని అడిగి వివరంగా తెలిసికొన్నారు. గురువు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యమని గ్రహించి, విశ్వామిత్రుడు చెప్పినట్లుగా వారు తాటకను వధించారు.

వారు సిద్ధాశ్రమం చేరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడారు. మారీచ సుబాహులను తరిమి కొట్టారు. మిథిలా నగరానికి గురువుగారితో వెడుతూ, గంగ మొదలయిన వాటిని గురించి గురువుగారిని అడిగి తెలిసికొన్నారు. గురువుగారి అనుగ్రహంతో ఎన్నో అస్త్రాలను ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చుకున్నారు.

దీనినిబట్టి రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని చెప్పగలము.

ప్రశ్న 8.
రాముడు తొలిసారిగా తాటక అనే సీని సంహరించడాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:
తాటక, ఒక యక్షిణి. ఆమె వేయి ఏనుగుల బలం కలది. తాటక, ఆమె కుమారుడు మారీచుడు, కలసి మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేశారు. దుష్టురాలు తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు కొంచెం సేపు మాట్లాడలేదు.

అప్పుడు విశ్వామిత్రుడు “స్త్రీని చంపడం ఎలా అని, నీకు అనుమానం వద్దు. అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదు” అని రాముడికి కర్తవ్యం ఉపదేశించాడు.

విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని దశరథుడు రాముడికి వచ్చేటప్పుడు చెప్పాడు. తండ్రిగారి ఆజ్ఞ రామునకు శిరోధార్యము. అలాగే గురువుగారయిన విశ్వామిత్రుడి ఆజ్ఞను పాటించడం శిష్యుడిగా రాముడి కర్తవ్యం. అందువల్లనే తాటక స్త్రీ అయినప్పటికీ, తండ్రి, గురువుల ఆజ్ఞలను శిరసావహించి, రాముడు తాటకను చంపాడు. అందులో తప్పు లేదు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*